మలాకీ 2:10-17

మలాకీ 2:10-17 TELUBSI

మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహముచేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయులమధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి; యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లిచేసికొనిరి. యాకోబు సంతతివారి డేరాలలోనుండి మేల్కొలుపు వారిని, పలుకువారిని, సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు; యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలను మీచేత తీసికొనకయు నున్నాడు. అది ఎందుకని మీ రడుగగా, యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. కొంచెముగానైనను దైవాత్మనొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మీ మాటలచేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగుచున్నారే. –దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారియందు ఆయన సంతోషపడును; లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పుకొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.