లూకా 7:36-48

లూకా 7:36-48 TELUBSI

పరిసయ్యులలో ఒకడు తనతోకూడ భోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్ర్తీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదము లను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి–ఈయన ప్రవక్తయైనయెడల తన్ను ముట్టుకొనిన యీ స్ర్తీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. అందుకు యేసు– సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు–అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను–అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన–నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్ర్తీవైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను–ఈ స్ర్తీని చూచుచున్నావే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి –నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను.