లూకా 23:39-56

లూకా 23:39-56 TELUBSI

వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు–నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను; సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి–ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్లిరి. ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబడించిన స్ర్తీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునైయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టు చుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకుమునుపెప్పుడును ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతిదినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయనుండి ఆయనతోకూడ వచ్చిన స్ర్తీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు లూకా 23:39-56 కు సంబంధించిన వాక్య ధ్యానములు