లూకా 22:54-62

లూకా 22:54-62 TELUBSI

వారాయనను పెట్టి యీడ్చుకొనిపోయి ప్రధానయాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టు కూర్చుండినప్పుడు, పేతురును వారిమధ్యను కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచి–వీడును అతనితోకూడ ఉండెనని చెప్పెను. అందుకు పేతురు–అమ్మాయీ, నేనతని నెరుగననెను. మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచి–నీవును వారిలో ఒకడవనగా పేతురు– ఓయీ, నేను కాననెను. ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు–నిజముగా వీడును అతనితోకూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు–ఓయీ, నీవు చెప్పినది నాకు తెలియ దనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను గనుక పేతురు–నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొని వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను.