లూకా 22:39-53

లూకా 22:39-53 TELUBSI

తరువాత ఆయన బయలుదేరి, తనవాడుకచొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి. ఆ చోటు చేరి ఆయన వారితో–మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్త మైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖముచేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. పండ్రెండుమందిలో యూదా అన బడినవాడు వారికంటె ముందుగా నడిచి, యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయనయొద్దకు రాగా యేసు–యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టు ఉన్నవారు జరుగబోవు దానిని చూచి–ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగనరికెను. అయితే యేసు–ఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను. యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధానయాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోను–మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను.