లూకా 22:14-23

లూకా 22:14-23 TELUBSI

ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి. అప్పుడాయన– నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి–మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి; ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పు చున్నాననెను. పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి–ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని–ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు పోవుచున్నాడుగాని ఆయన ఎవరిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను. వారు–ఈ పనిని చేయబోవువాడెవరో అని తమలోతాము అడుగుకొన సాగిరి.