లూకా 16:5-15

లూకా 16:5-15 TELUBSI

తన యజమానుని ఋణస్థులలో ఒక్కొక్కని పిలిపించి–నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని నడిగెను. వాడు– నూరు మణుగుల నూనె అని చెప్పగా–నీవు నీ చీటి తీసికొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పెను. తరువాత వాడు–నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు– నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో–నీవు నీ చీటి తీసికొనియెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను. అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులై యున్నారు. అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విష యములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా ఆయన–మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవునిదృష్టికి అసహ్యము.