లూకా 16:19-31

లూకా 16:19-31 TELUBSI

ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి –తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను–నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. అందుకు అబ్రాహాము – కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. అప్పుడతడు–తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. అందుకు అబ్రాహాము–వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు–తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లినయెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు–మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలోనుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.