లూకా 14:12-24

లూకా 14:12-24 TELUBSI

మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెను– నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుప కారము కలుగును. అయితే నీవు విందుచేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఆయనతోకూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు విని–దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో నిట్లనెను–ఒక మనుష్యుడు గొప్ప విందుచేయించి అనేకులను పిలిచెను. విందుకాలమందు అతడు – ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు– నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడు కొనుచున్నాననెను. మరియొకడు–నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను. మరి యొకడు – నేనొక స్ర్తీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను. అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజమానుడు కోపపడి–నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీను లను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతట దాసుడు–ప్రభువా, నీ వాజ్ఞాపించినట్టు చేసితినిగాని యింకను చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు–నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము; ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచూడడని మీతో చెప్పుచున్నాననెను.