లూకా 11:2-13

లూకా 11:2-13 TELUBSI

అందు కాయన–మీరు ప్రార్థన చేయునప్పుడు–తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము; మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను–మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి–స్నేహితుడా, నాకు మూడురొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల అతడు లోపలనేయుండినన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును;తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు లూకా 11:2-13 కు సంబంధించిన వాక్య ధ్యానములు