లూకా 11:14-36

లూకా 11:14-36 TELUBSI

ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు–వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు–పరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి. ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను–తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినయెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులైయుందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యము లను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున–నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి వెళ్లి, తనకంటె చెడ్డైవెన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగునని చెప్పెను. ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక స్ర్తీ ఆయనను చూచి–నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయనఅవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన యీలాగు చెప్పసాగెను–ఈ తరమువారు దుష్టతరము వారై యుండి సూచకక్రియ నడుగుచున్నారు. అయితే యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును. దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరమువారితోకూడ లేచి వారిమీద నేరస్థాపనచేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు. నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరమువారితోకూడ నిలువబడి వారిమీద నేరస్థాపనచేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి; ఇదిగో యోనా కంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు. ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును. కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచుకొనుము. ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలు గిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను.