లేవీయకాండము 10:12-20

లేవీయకాండము 10:12-20 TELUBSI

అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్లనెను– మీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములోనుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు. కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని. మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు, అనగా నీవును నీతోపాటు నీ కుమారులును నీ కుమార్తెలును పవిత్రస్థలములో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసికొని రావలెను. నిత్యమైన కట్టడచొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయి యుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి –మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలిపశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధముగదా. సమాజముయొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలములోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను. అందుకు అహరోను మోషేతో–ఇదిగో నేడు పాప పరిహారార్థబలిపశువును దహనబలిద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినినయెడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను.