యెహోషువ 11:16-23

యెహోషువ 11:16-23 TELUBSI

యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదువరకు ఆ దేశమంతటిని, అనగా మన్యమును దక్షిణదేశమంతటిని గోషేనుదేశమంతటిని షెఫేలాప్రదేశమును మైదానమును ఇశ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులనందరిని పట్టుకొని వారిని కొట్టిచంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులుగాక ఇశ్రాయేలీయులతో సంధిచేసిన పట్టణము మరి ఏదియులేదు. ఆ పట్టణములన్నిటిని వారు యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనముచేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవావారి హృదయములను కఠినపరచియుండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను, అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడును మిగిలియుండలేదు; గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశ మంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని నప్ప గించెను. అప్పుడు యుద్ధములేకుండ దేశము సుభిక్షముగా నుండెను.