యోబు 5:16-27

యోబు 5:16-27 TELUBSI

కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థ పరచును. ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గ బలమునుండియు ఆయన నిన్ను తప్పించును. నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని యుందువు అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవిమృగములకు నీవు ఏమాత్రమును భయపడవు నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండును నీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి యుండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదు రనియు నీకు తెలియును. వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది ఆలాగే యున్నది. ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము.