యోబు 30:1-15

యోబు 30:1-15 TELUBSI

ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని. వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును?వారి పౌరుషము పోయినది. దారిద్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి. వారు నరులమధ్యనుండి తరిమివేయబడినవారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులువారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను. తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు. వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠలు లేనివారికిని పుట్టినవారువారు దేశములోనుండి తరుమబడినవారు. అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను. వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావునవారు నాకు లోబడక కళ్లెము వదలించు కొందురు. నా కుడిప్రక్కను అల్లరిమూక లేచునువారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నామీద సాగింతురు. వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ జేయుదురు గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లువారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు. భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లువారు నా ప్రభావమును కొట్టి వేయుదురు మేఘమువలె నా క్షేమము గతించిపోయెను.