యోహాను 8:24-47

యోహాను 8:24-47 TELUBSI

కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను. కాబట్టి వారు–నీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితో–మొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే. మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహిం పక పోయిరి. కావున యేసు–మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో–మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు–మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు–పాపముచేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతం త్రులైయుందురు. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో–మా తండ్రి అబ్రాహామనిరి; యేసు–మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు– మేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను–దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.