యోహాను 7:32-53

యోహాను 7:32-53 TELUBSI

జనసమూహము ఆయననుగూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. యేసు–ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును; మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. అందుకు యూదులు– మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా? –నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి–ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ నుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడ లేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు. జనసమూహములో కొందరు ఈ మాటలు విని–నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి; మరికొందరు–ఈయన క్రీస్తే అనిరి; మరికొందరు–ఏమి? క్రీస్తు గలిలయలోనుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయననుగూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరి సయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారు–ఎందుకు మీరాయనను తీసికొని రాలేదని అడుగగా ఆ బంట్రౌతులు–ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు–మీరు కూడ మోస పోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు. అతడు–ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనకమునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు–నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.