యోహాను 7:25-44

యోహాను 7:25-44 TELUBSI

యెరూషలేమువారిలో కొందరు–వారు చంప వెదకు వాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా? అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చు నప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి. కాగా యేసు దేవాలయములో బోధించుచు–మీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచి–క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటికంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. జనసమూహము ఆయననుగూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. యేసు–ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును; మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. అందుకు యూదులు– మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా? –నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి–ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ నుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడ లేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు. జనసమూహములో కొందరు ఈ మాటలు విని–నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి; మరికొందరు–ఈయన క్రీస్తే అనిరి; మరికొందరు–ఏమి? క్రీస్తు గలిలయలోనుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయననుగూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు.