యోహాను 2:13-25

యోహాను 2:13-25 TELUBSI

యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి పావురములు అమ్మువారితో–వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు– నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి. కాబట్టి యూదులు –నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు –ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడుదినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు–ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడుదినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను. ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.