యోహాను 19:16-30

యోహాను 19:16-30 TELUBSI

అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనినిమధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి. మరియు పిలాతు–యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. –నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని–యూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధానయాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు–నేను వ్రాసిన దేమో వ్రాసితిననెను. సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్ర్తములు తీసికొని,యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీని కూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు–దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి.వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను; ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలు చుండుట చూచి–అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి–యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను. అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు–నేను దప్పిగొనుచున్నాననెను. చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను.