యోహాను 16:16-22

యోహాను 16:16-22 TELUBSI

కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు–కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరు చెప్పుకొనిరి. –కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను–కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటనుగూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు. అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.