యోహాను 13:3-10

యోహాను 13:3-10 TELUBSI

తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసియున్నదనియు యేసు ఎరిగి భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసి కొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చి నప్పుడు అతడు–ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. అందుకు యేసు–నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా పేతురు–నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు–నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు–ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తల కూడ కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి–స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.