యిర్మీయా 11:9-14

యిర్మీయా 11:9-14 TELUBSI

మరియు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను– యూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమపితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగము చేసియున్నారు. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – తాము తప్పించుకొనజాలని కీడు వారిమీదికి రప్పింపబోవుచున్నాను, వారు నాకు మొఱ్ఱపెట్టినను నేను వారి మొఱ్ఱను వినకుందును. యూదాపట్టణస్థులును యెరూషలేము నివాసులును పోయి తాము ధూపార్పణముచేయు దేవతలకు మొఱ్ఱపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజలనిమిత్తము ప్రార్థనచేయకుము; వారి నిమిత్తము మొఱ్ఱపెట్టకుము ప్రార్థనచేయకుము, వారు తమ కీడును బట్టి నాకు మొఱ్ఱపెట్టునప్పుడు నేను వినను.