అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనబడెను. యెహోవా –నీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులు– నా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు–ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచితిరిగి వెళ్లవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలోనుండి ఇరువది రెండువేలమంది తిరిగి వెళ్లిపోయిరి. పదివేలమంది నిలిచియుండగా యెహోవా–ఈ జను లింక ఎక్కువమంది, నీళ్లయొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీకొరకు వారిని శోధించెదను. ఇతడు నీతోకూడ పోవలెనని నేను ఎవనిగూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను; ఇతడు నీతో పోకూడదని యెవనిగూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్లయొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా–కుక్కగతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకుమోకాళ్లూని క్రుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికినవారిలెక్క మూడు వందలమంది; మిగిలిన జనులందరు నీళ్లు త్రాగుటకు మోకాళ్లూని క్రుంగిరి. అప్పుడు యెహోవా–గతికిన మూడు వందల మనుష్యులద్వారా మిమ్మును రక్షించెదను; మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను; జనులందరు తమతమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరిని తమ గుడారములకు వెళ్లనంపెనుగాని ఆ మూడువందలమందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను–నీవు లేచి దండుమీదికి పొమ్ము, నీ చేతికి దాని నప్పగించెదను. పోవుటకు నీకు భయమైనయెడల నీ పనివాడైన పూరాతోకూడ దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీచేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పని వాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా–నేనొక కలగంటిని, అదేమనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను. అందుకు వాని చెలికాడు–అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతనిచేతికి అప్పగింప బోవుచున్నాడని ఉత్తరమిచ్చెను.
చదువండి న్యాయాధిపతులు 7
వినండి న్యాయాధిపతులు 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: న్యాయాధిపతులు 7:1-14
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు