న్యాయాధిపతులు 6:11-32

న్యాయాధిపతులు 6:11-32 TELUBSI

యెహోవాదూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవా షునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లుగానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా యెహోవాదూత అతనికి కనబడి–పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా గిద్యోను–చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతనితట్టు తిరిగి–బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం పుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు –చిత్తము నా యేలినవాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా–అయిన నేమి? నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను. అందుకతడు–నాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము. నేను నీయొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయన–నీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లనుకుండలో పోసి ఆయనకొరకు ఆ మస్తకివృక్షముక్రిందికి దానిని తీసికొనివచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతిమీద పెట్టి– నీళ్లు పోయుమని అతనితో చెప్పెను. అతడాలాగుచేయగా యెహోవాదూత తన చేతనున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవాదూత అతనికి అదృశ్య మాయెను. గిద్యోను ఆయన యెహోవాదూత అని తెలిసికొని–అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవాదూతను చూచితిననెను. అప్పుడు యెహోవా–నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠముకట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రియందే యెహోవా–నీ తండ్రి కోడెను, అనగా ఏడేండ్ల రెండవ యెద్దును తీసికొని వచ్చి, నీ తండ్రికట్టిన బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి, దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి తగిన యేర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠముకట్టి, ఆ రెండవ కోడెను తీసికొనివచ్చి నీవు నరికిన ప్రతిమయొక్క కఱ్ఱతో దహనబలి నర్పించుమని అతనితో చెప్పెను. కాబట్టి గిద్యోను తన పనివారిలో పదిమందిని తీసికొనివచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరివారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను. ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలుయొక్క బలిపీఠము విరుగగొట్టబడియుండెను, దానికి పైగా నున్న దేవతాస్తంభమును పడద్రోయబడి యుండెను, కట్టబడిన ఆ బలిపీఠముమీద ఆ రెండవ యెద్దు అర్పింప బడి యుండెను. అప్పుడు వారు–ఈ పని యెవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణచేసి వెదకి, యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పనిచేసినట్టు తెలిసికొనిరి. కాబట్టి ఆ ఊరివారు–నీ కుమారుడు బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో–మీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వాని రక్షించుదురా? వానిపక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను; ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక, వాడు దేవతయైనందున తన పక్షమున తానేవాదించ వచ్చును. ఒకడు తన బలిపీఠమును విరుగ గొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను.