న్యాయాధిపతులు 6:1-10

న్యాయాధిపతులు 6:1-10 TELUBSI

ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్ప గించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయులమీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱెనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధనమైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను. దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి. మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయులయొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను – ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–నేను ఐగుప్తులోనుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములోనుండి మిమ్మును తోడుకొని వచ్చితిని. ఐగుప్తీయుల చేతిలోనుండియు మిమ్మును బాధించిన వారందరిచేతిలోనుండియు మిమ్మును విడిపించి, మీ యెదుటనుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని; మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితినిగాని మీరు నా మాట వినకపోతిరి.