న్యాయాధిపతులు 3:12-21

న్యాయాధిపతులు 3:12-21 TELUBSI

ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొనిపోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరచెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని, తన వస్త్రములో తన కుడి తొడమీద దానిని కట్టుకొని, ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. ఏహూదు ఆ కప్పము తెచ్చి యిచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చి– రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలె ననగా అతడు–తనయొద్ద నిలిచినవారందరు వెలుపలికి పోవువరకు ఊరకొమ్మని చెప్పెను. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండియుండెను. ఏహూదు–నీతో నేను చెప్ప వలసిన దేవునిమాట ఒకటి యున్నదని చెప్పగా అతడు తన పీఠముమీదనుండి లేచెను. అప్పుడు ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి ఆ కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను.