యాకోబు 5:1-12

యాకోబు 5:1-12 TELUBSI

ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి. మీ ధనము చెడి పోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. మీ బంగారమును మీ వెండియు తుప్పుపెట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపెట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడువరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచు కొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబుయొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను.