యాకోబు 2:1-13

యాకోబు 2:1-13 TELUBSI

నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి–నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో–నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చు చున్నవారు వీరే గదా? మీకు పెట్టబడిన శ్రేప్ఠమైన నామమును దూషించువారు వీరే గదా? మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును; వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్రవిషయములో నపరాధి వైతివి. స్వాతంత్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగు ననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.