యాకోబు 1:9-15

యాకోబు 1:9-15 TELUBSI

దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును. సూర్యుడు దయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.