హెబ్రీయులకు 5:1-10

హెబ్రీయులకు 5:1-10 TELUBSI

ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును. తాను కూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు. మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును. అటువలె క్రీస్తు కూడ ప్రధానయాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని –నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను. ఆప్రకారమే –నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు. శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులుకలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన, కుమారుడైయుండియు తాను పొందినశ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.