హగ్గయి 1:5-11

హగ్గయి 1:5-11 TELUBSI

కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా –మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనముచేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానముచేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను; మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; ఎందు చేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొనుటకు త్వరపడుటచేతనే గదా. కాబట్టి మిమ్మునుబట్టి ఆకాశపుమంచు కురువకయున్నది, భూమి పండక యున్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.