ఆదికాండము 3:16-24

ఆదికాండము 3:16-24 TELUBSI

ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో–నీవు నీ భార్యమాట విని–తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా–ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొనితిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.

ఆదికాండము 3:16-24 కోసం వీడియో