ఆదికాండము 29:13-30

ఆదికాండము 29:13-30 TELUBSI

లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొనివచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను–నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై యున్నావు అనెను. అతడు నెలదినములు అతనియొద్ద నివసించిన తరువాత లాబాను–నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబు నడిగెను. లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా; చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది; రాహేలు రూపవతియు సుందరియునై యుండెను. యాకోబు రాహేలును ప్రేమించి–నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను. అందుకు లాబాను–ఆమెను అన్యునికిచ్చుటకంటె నీకిచ్చుట మేలు; నాయొద్దఉండు మని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు–నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా లాబాను ఆ స్థలములోనున్న మనుష్యుల నందరిని పోగుచేసి విందుచేయించి రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతనియొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను–పెద్ద దానికంటె ముందుగా చిన్న దాని నిచ్చుట మాదేశ మర్యాదకాదు. ఈమెయొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరువాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.

ఆదికాండము 29:13-30 కోసం వీడియో