ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడి–నీవుచేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. అందుకు అబ్రాహాము–ప్రమాణము చేసెదననెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు–ఈ పని యెవరు చేసిరో నేనెరుగను; నీవును నాతో చెప్పలేదు; నేను నేడేగాని యీ సంగతి విన లేదని చెప్పగా అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి. తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలోనుండి యేడు పెంటిపిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రాహాముతో–నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱెపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు –నేనే యీ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱెపిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను. అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.
చదువండి ఆదికాండము 21
వినండి ఆదికాండము 21
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 21:22-34
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు