ఆదికాండము 18:20-33

ఆదికాండము 18:20-33 TELUBSI

మరియు యెహోవా–సొదొమ గొమొఱ్ఱాలనుగూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను. ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రాహాము సమీపించి యిట్లనెను–దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతులనిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతోకూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా–సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను అందుకు అబ్రాహాము–ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువు తో మాటలాడ తెగించుచున్నాను. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన–అక్కడ నలుబదియైదు గురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను; అతడింక ఆయనతో మాటలాడుచు–ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా అతడు–ప్రభువు కోపపడనియెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను. అందుకతడు–ఇదిగో ప్రభువు తో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన –ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా అతడు–ప్రభువు కోపపడనియెడల నే నింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను. యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.

ఆదికాండము 18:20-33 కోసం వీడియో