ఆదికాండము 1:3-19

ఆదికాండము 1:3-19 TELUBSI

దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు–జలములమధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవదినమాయెను. దేవుడు–ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు– గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆప్రకార మాయెను. భూమి గడ్డిని తమతమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. దేవుడు–పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలు గిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.

ఆదికాండము 1:3-19 కోసం వీడియో