గలతీయులకు 4:12-26

గలతీయులకు 4:12-26 TELUBSI

సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసునువలెను నన్ను అంగీక రించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్య మైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు; మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసి వేయ గోరుచున్నారు. నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడువరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది. మిమ్మునుగూర్చి యెటుతోచక యున్నాను; నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరియొక విధముగా మీతో మాటలాడ గోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడియుండగోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా? అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియాదేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతోకూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి.