గలతీయులకు 1:2-10

గలతీయులకు 1:2-10 TELUBSI

నాతోకూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిదివరకు చెప్పినప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించినయెడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరు చున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.