గలతీయులకు 1:13-24

గలతీయులకు 1:13-24 TELUBSI

పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల వాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి. అయినను తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు. నాకంటె ముందుగా అపొస్తలు లైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని. అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని. క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయములేకుండెను గాని –మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని, వారు నన్నుబట్టి దేవుని మహిమపరచిరి.