ఎజ్రా 3:1-9

ఎజ్రా 3:1-9 TELUBSI

ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమతమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగినవారై యెరూషలేములో కూడి, యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్థులైనవారికి భయపడుచు, ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి, దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చిరి మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి, ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవాయొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి. ఏడవ నెల మొదటి దినమునుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరముయొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు. మరియు వారు కాసెవారికిని వడ్రవారికిని ద్రవ్యము నిచ్చిరి. అదియుగాక పారసీకదేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రముమీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజనపదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములోనుండు దేవునియొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవనెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చినవారందరును పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను యెహోవా మందిరముయొక్క పనికి నిర్ణయించిరి. యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు కుమారులును, వారి కుమారులును, లేవీయులైనవారి బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి.