మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, సమాచార మెత్తి ప్రవచింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా–ఆహా శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమదినము వచ్చెనే, యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము. ఖడ్గము ఐగుప్తు దేశముమీద పడును, ఐగుప్తీయులలో హతులు కూలగా కూషుదేశస్థులు వ్యాకులపడుదురు, శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులందరును ఖడ్గముచేత కూలుదురు.
యెహోవా సెలవిచ్చునదేమనగా–ఐగుప్తును ఉద్ధరించు వారు కూలుదురు, దాని బలగర్వము అణగిపోవును, మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు జనులు ఖడ్గముచేత కూలుదురు. పాడైపోయిన దేశములమధ్య ఐగుప్తీయులు దిక్కులేనివారుగా నుందురు, నలుదిక్కుల పాడైపోయిన పట్టణములమధ్య వారి పట్టణము లుండును. ఐగుప్తుదేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులులేకుండ చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. ఆ దినమందు దూతలు నా యెదుటనుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు, ఐగుప్తునకు విమర్శకలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగో అది వచ్చే యున్నది.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఐగుప్తీయులుచేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్రెజరుచేత నేను మాన్పించెదను. జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును, ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు. నైలునదిని ఎండిపోజేసి నేనాదేశమును దుర్జనులకు అమ్మి వేసెదను, పరదేశులచేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడుచేయించెదను, యెహోవానైన నేను మాట యిచ్చియున్నాను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను. పత్రోసును పాడుచేసెదను. సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను. ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మ రించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను ఐగుప్తుదేశములో నేను అగ్ని యుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు. ఓనువారిలోను పిబేసెతువారిలోను యౌవనులు ఖడ్గముచేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.