నిర్గమకాండము 6:1-12

నిర్గమకాండము 6:1-12 TELUBSI

అందుకు యెహోవా–ఫరోకు నేను చేయబోవు చున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములోనుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను–నేనే యెహోవాను; నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనానుదేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకముచేసికొని యున్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము–నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములోనుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి, మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు. నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణముచేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమునుబట్టియు మోషే మాట వినరైరి. మరియు యెహోవా మోషేతో–నీవు లోపలికి వెళ్లి, ఐగుప్తురాజైన ఫరోతో–ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే–చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.

నిర్గమకాండము 6:1-12 కోసం వీడియో