నిర్గమకాండము 36:1-19

నిర్గమకాండము 36:1-19 TELUBSI

పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞావివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను. బెసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరిని మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషేయొద్ద నుండి తీసికొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయుచేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయుపని విడిచివచ్చి మోషేతో–చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నారని చెప్పగా మోషే–పరిశుద్ధస్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీయైనను ఇకమీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి; ఆ పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసికొనివచ్చుట మానిరి. ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు; ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్చెను; మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను, రెండవ కూర్పునున్న తెర అంచున ఏబదికొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒక దానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒక దానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. మరియు మందిరముమీద గుడారముగా మేకవెండ్రుకలతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగా చేసెను. ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగుమూరలు; ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబదికొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకులను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను. మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను.

నిర్గమకాండము 36:1-19 కోసం వీడియో