నిర్గమకాండము 3:9-22

నిర్గమకాండము 3:9-22 TELUBSI

ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. అందుకు మోషే–నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా ఆయన–నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను. మోషే–చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచి–మీపితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు–ఆయన పేరేమి అని అడిగినయెడల వారితో నే నేమి చెప్పవలెనని దేవుని నడిగెను. అందుకు దేవుడు –నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన–ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. మరియు దేవుడు మోషేతో నిట్లనెను–మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి–మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను – నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని, ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజునొద్దకు వెళ్లి అతని చూచి–హెబ్రీ యులదేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును; కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భు తములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును. మరియు నేను ఈ జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు. ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండినగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.

నిర్గమకాండము 3:9-22 కోసం వీడియో