ఎస్తేరు 2:1-10

ఎస్తేరు 2:1-10 TELUBSI

ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషుయొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమె చేసినదానిని ఆమెకు నిర్ణయింపబడినదానిని తలంచగా యౌవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి–అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును, అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరిని సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజుయొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యముయొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధికొరకు సుగంధద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయెను గనుక అతడు ఆలాగు జరిగించెను. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను పట్టుకొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతోకూడ యెరూషలేము నుండి చెరపట్టబడినవారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు తలిదండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమునుగలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురముచేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగేవశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను; కాబట్టి ఆమె పరిమళక్రియలకొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజనపదార్థములను, రాజు ఇంటిలోనుండి ఆమెకు ఇయ్యదగిన యేడుగురు ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్ఠమైన స్థలమందుంచెను. మొర్దకై–నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు.