ఎఫెసీయులకు 5:1-21

ఎఫెసీయులకు 5:1-21 TELUBSI

కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సర సోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి నిష్ఫలమైన అంధకారక్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులనుగూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా అందుచేత –నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు. దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.