ద్వితీయోపదేశకాండము 9:1-8

ద్వితీయోపదేశకాండము 9:1-8 TELUBSI

ఇశ్రాయేలూ వినుము; నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములుగల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోవుచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల యెదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి గదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలిసికొనుము. ఆయన వారిని నశింపజేసి నీ యెదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్లగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు. నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి వారిని తోలివేసినతరువాత–నేను ఈ దేశమును స్వాధీన పరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతియైనను నీ హృదయ యథార్థతయైనను హేతువుకాదు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణముచేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవావారిని నీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్నాడు. మీరు లోబడ నొల్లనివారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచు కొనునట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతినిబట్టి నీకియ్యడని నీవు తెలిసికొనవలెను. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిన దినము మొదలుకొని యీ స్థలమందు మీరు ప్రవేశించువరకు మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీమీద తెచ్చుకొనెను.