ద్వితీయోపదేశకాండము 8:1-9

ద్వితీయోపదేశకాండము 8:1-9 TELUBSI

మీరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా మీపితరులతో ప్రమాణముచేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము. ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ జేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలోనుండియు కొండలలోనుండియు పారు ఊటలును అగాధజలములునుగల దేశము. అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లునుగల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును.