ద్వితీయోపదేశకాండము 7:6-12

ద్వితీయోపదేశకాండము 7:6-12 TELUBSI

నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువేగదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములోనుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడుననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను. ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యముచేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచు కొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణముచేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును.